ఖమ్మం 45.6...నిజామాబాద్‌ 44.4 డిగ్రీలు...

May 21, 2019
img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిదంగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్ కర్నూల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు నిప్పుల కొలిమిలా భగభగమండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. మనుషులే కాదు...నోరులేని మూగజీవాలు..వీధి కుక్కలు, పశువులు, పక్షులు కూడా విలవిలలాడుతున్నాయి. అనేక ప్రాంతాలలో ఈ వేడిని తట్టుకోలేక పక్షులు, కోళ్ళు చనిపోతున్నాయి కూడా.   


ఖమ్మంలో గత వారం అత్యదికంగా 45.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొన్న ఆదివారంనాడు నిజామాబాద్‌లో అత్యధికంగా 44.4 డిగ్రీలు, భద్రాచలంలో 43.8, మెదక్‌ లో 43.6, రామగుండంలో 44.2, మహబూబ్‌నగర్‌లో 42.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో నాలుగు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవి సగటు ఉష్ణోగ్రతల కంటే సుమారు 3.1 డిగ్రీలు అధికంగా ఉందని చెప్పారు. ఖమ్మంలో ఏకంగా 6.1 డిగ్రీలు అధికంగా నమోదైందని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో నమోదైన 42.4 డిగ్రీలు రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత అని చెప్పారు. హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంట నగరాలలో కూడా వేడి, వడగాడ్పులు భరించశక్యం కానీ స్థాయికి చేరుకొంటున్నాయి. 


ఒకప్పుడు ఏడారులలో, గల్ఫ్, ఆఫ్రికా దేశాలలో మాత్రమే ఇంత తీవ్రమైన వేడి, ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ నదులు, చెట్లతో కళకళలాడే భారత్‌లో కూడా గత కొన్ని దశాబ్ధాలుగా చాలా జోరుగా పర్యావరణ విధ్వంసం జరుగుతుండటం,  పచ్చదనం తగ్గి కాంక్రీట్ కట్టడాలు, వాహన కాలుష్యం పెరిగిపోవడం వలన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏటేటికీ పెరిగిపోతున్నాయి. ఇకనైనా ప్రజలు, ప్రభుత్వాలు మేల్కొని పచ్చదనం పెంచకపోతే మున్ముందు ఇళ్ళలో కూడా ఉండలేని దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు.

Related Post