మేడారం జాతర ఎప్పుడంటే...

April 22, 2019
img

ప్రతీ రెండేళ్ళకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో బుద,గురు, శుక్రవారాలలో మేడారంలో సమ్మక్క సారలమ్మ మహా జాతరను నిర్వహిస్తుంటారు. తదుపరి జాతర తేదీలను ఖరారు చేసేందుకు ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అధ్యక్షతన ఆదివారం మేడారంలో సమావేశమయ్యి జాతర తేదీలను ఖరారు చేశారు. 

2020, ఫిబ్రవరి 5,6,7 తేదీలలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను నిర్వహించబోతున్నట్లు ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 6న సమ్మక్కను గద్దెకు చేర్చిన తరువాత మరుసటి రోజున ఆ నలుగురురు వనదేవతలకు పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లిస్తారు. మళ్ళీ ఫిబ్రవరి 8న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను వనప్రవేశం చేయించడంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. 

ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర వాస్తవానికి ఆదివాసీలు, గిరిజనులు నిర్వహించుకొనే ఉత్సవాలు అయినప్పటికీ అవి తెలంగాణ సంస్కృతిలో ఎంతగా ఇమిడిపోయాయంటే రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు మేడారం తరలివచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకొంటారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దక్షిణభారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే. దీనికి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. 

Related Post