కేశవపురం ప్రత్యేకత అదే!

April 16, 2019
img

అదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో కేశవపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఇళ్ళలో శుభకార్యాలు జరుగవు. ముఖ్యంగా పెళ్లిళ్లు అసలే జరుగవు. ఇతర ప్రాంతాల నుంచి బందుమిత్రులు ఎవరూ ఆ ఊరికి రారు. ఒక్కోసారి ఆ ఊళ్ళోవారే వేరే ప్రాంతాలలో తమ బందువుల ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఏదైనా మూడాచారం కారణంగా గ్రామస్తులు అలా చేస్తున్నారా?అంటే కాదు...త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేకనే అలా చేస్తున్నారు! కేశవపురంలో 900 కుటుంబాలు ఉన్నాయి. అందరిదీ ఇదే పరిస్థితి.

ఫిబ్రవరి నెలలోనే గ్రామంలోని బోర్లు, బావులు, చెరువులు అన్ని ఎండిపోతుంటాయి. దాంతో నీళ్ళ కోసం గ్రామంలో పురుషులు, మహిళలు, వారి వెంట పిల్లలు రోజూ తెల్లారగానే బిందెలు నెత్తి మీద పెట్టుకొని 2-3 కిమీ దూరంలో ఉన్న పక్క గ్రామానికి బయలుదేరుతుంటారు. పొద్దున్నే నీళ్ళ బిందెలతో వస్తున్న తమను చూసి ఆ గ్రామస్తులు చీదరించించుకొంటారని, అయినా ప్రాణం నిలుపుకోవడం కోసం ఆ అవమానాలను, కష్టాలను భరించకతప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న మిషన్ భగీరద పధకం ఇంతవరకు పూర్తి కాకపోవడంతో ప్రతీ ఏడు ఫిబ్రవరి నెల నుంచే తమకు ఈ నీటి కష్టాలు మొదలవుతాయని చెప్పారు. మళ్ళీ జూలై నెలలో తొలకరి జల్లులు పడేవరకు 5 నెలలపాటు ప్రతీరోజు తెల్లారితే తమకు ఈ నీటి కష్టాలు భరించకతప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజూ నీళ్ళ కోసం తిరగవలసివస్తుండటంతో కూలిపనులు కూడా చేసుకోలేకపోవడంతో ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నామని గ్రామంలో కొందరు మహిళలు చెప్పారు. కేశవపురం నీటి కష్టాల గురించి మీడియాలో వార్తలు రాగానే అధికారులు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి వెళ్ళిపోతుంటారు తప్ప ఇంతవరకు ఎవరూ తమ త్రాగునీటి కష్టాలను తీర్చలేదని అన్నారు. అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తమ సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా పట్టించుకోవడం లేదని, ఇక తాము ఎవరికి మొర పెట్టుకోవాలో తెలియడం లేదని కేశవపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవపురం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఈ త్రాగునీటి సమస్యపై తెరాస పాలకులు ఏమంటారో?

Related Post