రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి

March 12, 2019
img

వారి ఇళ్ళ ముందు వేసిన పెళ్ళిపందిళ్ళు ఇంకా తీయనేలేదు...అంతలోనే ఆ నవదంపతులను మృత్యువు కబళించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం కుమ్మరిగూడెం బస్టాప్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజాడీ నరేష్(25), బలిజ దివ్య పూజిత (22) అనే నవదంపతులు ఘటనాస్థలంలోనే చనిపోయారు. 

జిల్లాలోని గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేజాడీ నరేష్ భువనగిరి పట్టణానికి చెందిన బలిజ దివ్య పూజితలకు మూడు వారాల క్రితమే వివాహం అయ్యింది. నరేష్ హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి చెందిన 108 వాహనం డ్రైవరుగా పనిచేస్తుంటాడు. ఆమె స్థానిక కళాశాలలో డిగ్రీ ద్వితీయ సం. పరీక్షలకు సిద్దం అవుతోంది. పరీక్షలు సమీపిస్తున్న కారణంగా పెళ్ళయిన తరువాత ఆమె పుట్టింట్లోనే ఉండి చదువుకొంటోంది. 

అదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి భువనగిరి వచ్చిన నరేష్ భార్యతో కలిసి ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి వెళ్ళి అక్కడ ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం తమ ద్విచక్రవాహనంపై కేసారం గ్రామానికి వారు బయలుదేరారు. వారి వాహనం కుమ్మరిగూడెం బస్టాప్‌ వద్దకు చేరుకొన్నప్పుడు రోడ్డుపై వెళుతున్న ఒక వాహనాన్ని దాటుకొని ముందుకు వెళ్లబోయారు. కానీ అక్కడ రోడ్డుపై ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి చెందిన లారీ నిలిపి ఉంచడంతో వారు దానిని గుద్దుకొని క్రిందపడిపోయారు. భార్యాభర్తలిద్దరి తలలకు బలమైన గాయాలు అవడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని వారి శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెళ్ళై నెలరోజులు కాకమునుపే నవదంపతులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Related Post