నేను దేవుడిని..కనుక డ్యూటీకి రాలేను!

May 19, 2018
img

‘నేను దేవుడిని..కనుక డ్యూటీకి రాలేను!’ అవును మీరు చదువుతున్నది నిజమే. శలవులో వెళ్ళిన ఒక ఉద్యోగి తన సంస్థకు చెప్పిన జవాబు ఇదే. గుజరాత్ లోని వడోదరలో సర్దార్ సరోవర్ నర్మదా నిగం లిమిటెడ్ సంస్థలో ఇంజనీరుగా పనిచేస్తున్న రమేష్ చంద్ర 8 నెలల క్రితం వరకు బాగానే ఉన్నాడు. ఒకసారి హటాత్తుగా కొన్నిరోజులు శలవు పెట్టాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం శలవు పెడుతున్నట్లు శలవు చీటీలో పేర్కొన్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏవో పూజలు చేసుకొంటారని లేదా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళివస్తారని భావించిన అయన పైఅధికారులు అభ్యంతరం చెప్పకుండా శలవు మంజూరు చేశారు.

కానీ రోజులు గడిచిపోతున్నా అతను మళ్ళీ విధులకు హాజరుకాక పోవడంతో, సంజాయిషీ కోరుతూ ఆ సంస్థ అతనికి నోటీసులు పంపించడం మొదలుపెట్టింది. చివరికి 8 నెలలు గడిచిన తరువాత రమేష్ చంద్ర తాపీగా సమాధానం పంపించాడు. అది చదివి ఆ సంస్థలో అధికారులు అందరూ నోరు వెళ్ళబెట్టారు. 

ఇంతకీ రమేష్ చంద్ర ఏమి వ్రాసాడంటే, “నేను విష్ణుమూర్తి అంశతో జన్మించినవాడిని. నా తల్లి అహల్య. నా అర్ధాంగి సాక్షాత్ లక్ష్మీదేవి. అలనాడు నేనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వామనుడు మొదలైన అవతారాలన్నీ ధరించి లోకోద్ధారణ చేశాను. ఇప్పుడు విశ్వకల్యాణం కోసం కల్కి భగవానుడిగా జన్మించాను. ప్రస్తుతం విశ్వశ్రేయస్సు కోరి తపస్సు చేస్తున్నాను. కనుక నేను భౌతికరూపంలో విధులకు హాజరుకాలేను. నా తపస్సు ఫలించి వర్షాలు పడబోతున్నాయి. కనుక అంతవరకు ఎవరూ నా తపస్సుకు భంగం కలిగించవద్దని మనవి.”

Related Post