రాజమౌళి కొత్త సినిమా ప్రకటన... విన్నారా?

September 19, 2023
img

ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని కంటే ముందు మరో సినిమా చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కధ ఆధారంగా మేడ్ ఇన్ ఇండియా అనే సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి తెలిపారు. 

అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదు. ప్రముఖ మరాఠీ చిత్ర దర్శకుడు నితిన్ కక్కర్ దర్శకత్వంలో ‘షోయింగ్ బిజినెస్’, ‘ఎ మేజర్ మోషన్ పిక్చర్’ బ్యానర్లపై రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తాతో కలిసి నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా ఉంటారు. 

ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి తెలియజేశారు. 

ఈ సినిమా గురించి తెలియజేస్తూ, “మొట్టమొదట ఈ ప్రస్తావన విన్నప్పుడు నేను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. బయోపిక్ తీయడం చాలా కష్టం. భారతీయ సినిమా పితామహుడి జీవితకధను సినిమాగా తీయాలంటే ఇంకా కష్టం. అయినప్పటికీ మా కుర్రాళ్ళు ఇందుకు సిద్దంగా ఉన్నారు. మేడ్ ఇన్‌ ఇండియా సినిమా చేయబోతున్నట్లు సగర్వంగా ప్రకటిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

మనదేశంలో మొట్ట మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. దాదా సాహెబ్ ఫాల్కే తీసిన ఈ సినిమా 1913లో విడుదలైంది. భారతీయ సినిమాలకు అదే బలమైన పునాది వేసింది. ఆ తర్వాత మూకీ సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కలర్, స్కోప్, 70 ఎంఎం, డిజిటల్, గ్రాఫిక్స్ ఇలా నానాటికీ దినదిన ప్రవర్ధమానం అవుతూ నేడు ఆస్కార్ అవార్డులు అందుకొనే స్థాయికి ఎదిగింది.         

అయితే 1913లోనే దాదా సాహెబ్ ఫాల్కేకు సినిమాలు తీయాలనే ఆలోచన ఎలా కలిగింది?కనీసం సినిమాలు తీసేందుకు స్టూడియోలు, నటించేందుకు నటీనటులు కూడా లేని ఆరోజుల్లో ఆయన ఈ సినిమాను ఎలా తీయగలిగారు? దాని కోసం ఆయన ఏవిదంగా కృషి చేశారు?వంటి వివరాలు పత్రికలు, పుస్తకాలలో ఎప్పుడో వచ్చాయి. కానీ సినిమా రూపంలో రాలేదు. కనుక సినిమా ద్వారా అయితే ఆయన తొలిసినిమా తీయడానికి పడిన కష్టం, చేసిన కృషి యావత్ దేశ ప్రజలకు అర్దమవుతుంది. కనుక రాజమౌళి వెంటనే ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకొన్నారు.  


Related Post