చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ వదులుకొన్నారట!

August 30, 2023
img

మెగాస్టార్ టాలీవుడ్‌లో ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కానీ ఆయన అదేమీ మొదటి ఇన్నింగ్స్ అంత గొప్పగా సాగడం లేదని అందరికీ తెలుసు. అందుకు ఆయన ఎంచుకొంటున్న రీమేక్ సినిమాలు, దర్శకులే కారణమని అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

తన సినిమాలపై చాలా మంది ఆధారపడి ఉంటారు కనుక తన ఇమేజికి తగ్గ కధలను ఎంచుకోవలసి వస్తోందని చిరంజీవి సమర్ధించుకొంటున్నప్పటికీ, అవీ హిట్ కావడం లేదు కదా?అని ప్రశ్నించేవారున్నారు. చిరంజీవి తన ఇమేజి చట్రంలో తనను తాను బందించుకోవడం వలననే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన నుంచి గొప్ప సినిమాలు రావడం లేదనే అభిప్రాయం వినబడుతుంటుంది. 

చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ తీసిన రాజ్‌ అండ్ డీకేలు దానిని చిరంజీవితోనే తీయాలని ఆ కధ వ్రాసుకొన్నారు. అయితే దానిలో చిరంజీవి ఇద్దరి బిడ్డల తండ్రిగా నటించాల్సి ఉండటంతో అందుకు ఒప్పుకోలేదు. 

కానీ వారు చిరంజీవితోనే ఆ వెబ్‌ సిరీస్‌ని తీయాలని పట్టుదలగా ఉన్నందున ఆయన కోసం పిల్లల పాత్రలను తొలగిస్తామని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ చిరంజీవి ఆ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు అంగీకరించలేదు. దాంతో వారు చిరంజీవి స్థానంలో మనోజ్ వాజ్‌పాయ్‌తో ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ తీశారు. అది ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరూ చూశారు. ఒకవేళ అదే వెబ్‌ సిరీస్‌ని చిరంజీవి చేసి ఉంటే అది మరో స్థాయిలో ఉండేది కదా?” అని అన్నారు. 

చిరంజీవి తన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఖైదీ 150, ఆచార్య, వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్‌ సినిమాలు చేస్తే అన్నీ బోర్లా పడ్డాయి. అదే... రజనీకాంత్ తాతయ్య పాత్రలో జైలర్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక చిరంజీవి కూడా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లాగా తన వయసుకు తగ్గ పాత్రలు, కధలు ఎంచుకొని చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ మరింత గొప్పగా సాగుతుంది. 

Related Post