బంగారు కత్తి అని మెడ కోసుకోలేమన్నట్లే గొప్ప నటుడుగా అందరినీ మెప్పించిన ఎన్టీఆర్ దైవస్వరూపుడు కాదని నిర్భయంగా మాట్లాడినందుకు నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి బహిష్కరించారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, “ఎవరు ఒత్తిళ్ళకు లొంగి మరెవరిమీదో చర్యలు తీసుకోవడం ‘మా’కు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ అంటే నాకు చాలా గౌరవమే. ఓ నటిగా ఆయనను నేను చాలా అభిమానిస్తాను. గౌరవిస్తాను. కానీ ఆయనను దైవస్వరూపుడంటే ఏకీభవించను. ఖమ్మం లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం పెడితే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఆయనను శ్రీకృష్ణుడు రూపంలో ఆయన విగ్రహం పెట్టడమే సరికాదని నేను అన్నాను. ఎందుకంటే, మన సినీ ఇండస్ట్రీలో దేవుడు పాత్రలు చేసిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారి అభిమానులు కూడా ఇలా వారిని దైవస్వరూపాలుగా విగ్రహాలు ఏర్పాటు చేయిస్తే పరిస్థితి ఏమిటి?
అందుకే నేను ఎన్టీఆర్ సొంత రూపంలో విగ్రహాన్ని పెట్టాలని నేను కోరాను తప్ప ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. ఇవన్నీ ‘మా’కు తెలిసి ఉన్నా నన్ను సంజాయిషీ కోరుతూ నోటీస్ పంపించింది. కానీ సంజాయిషీ ఇచ్చుకొనేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా ‘మా’ నుంచి నన్ను బహిష్కరించింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయినా ‘మా’లో ఉండి ఎటువంటి ప్రయోజనమూ లేదు. కనుక నన్ను బహిష్కరించినందుకు మాకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని ఘాటుగా బదులిచ్చారు.