టైగర్ నాగేశ్వరరావు... ఇదేం వెర్రితనం?

May 24, 2023
img

మాస్ మహారాజ రవితేజ, నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణుకా దేశాయ్ ప్రధాన పాత్రలలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా  అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. 1970 దశకంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గడగడలాడించిన పేరుమోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కధ ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా సిద్దమవుతోంది. 

ఇవాళ్ళ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రాజమండ్రి రైల్వే బ్రిడ్జిపై నుంచి వెరైటీగా విడుదల చేశారు. దీని కోసం ఆ వంతెనపై వెళుతున్న రైలును గజదొంగలు అడ్డగించి, దానిలో ప్రయాణికులను దోచుకొన్నట్లు లైవ్ సీన్ చూపారు. తర్వాత బ్రిడ్జిపై నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’ పోస్టర్స్ విడుదల చేశారు.  

సినీ ఫ్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినీ పరిశ్రమలో వారు రకరకాలుగా ప్రయత్నిస్తుండటం సహజమే. కానీ ఈ ప్రయత్నం మరీ అతిగా ఉంది. ఇంతా కష్టపడినా అక్కడ వీక్షించేందుకు 2-300 మంది కూడా లేరు. దూరంగా రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి మీద నుంచి, నది ఒడ్డు నుంచి కొందరు ఆసక్తిగా గమనించినా, అంత దూరం నుంచి అక్కడ ఏం జరుగుతోందో స్పష్టంగా కనబడదు. వినబడదు. కొన్ని బోట్లుపై తీసుకొచ్చిన జనానికి కూడా వంతెనపై రైలు దోపిడీ సీన్ చూసే అవకాశం లేదు. 

ఇప్పటికే రవితేజ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలీదు. కనుక వెరైటీ కోసం ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసి నిర్మాతను ఇంకా ముంచేయడం ఎందుకు?అనిపిస్తుంది. పైగా ఇటువంటి కధాంశంతో సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తుండటం ఇంకా సాహసమే.

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్‌ దాచారం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

వంశీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్‌ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. 

   

Related Post