ఆ విషయంలో వారు చెప్పిన్నట్లే వింటాను: చిరంజీవి

January 11, 2023
img

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతోంది కనుక ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొని మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. 

“మీరు కమర్షియల్ సినిమాలు చేయడానికే ఇష్టపడతారా?” అనే ప్రశ్నకి “యస్. నేనుకమర్షియల్ సినిమాలు ఇష్టపడతాను. ఎందుకంటే రూ.100 పెట్టి టికెట్‌ కొనుక్కొని నా సినిమాకి వచ్చే ప్రేక్షకులు నా నుంచి ఏమి ఆశిస్తున్నారో అదే ఇవ్వాలనుకొంటాను. అయితే సినిమాలో నాకు ఎన్ని పాటలు, ఫైట్స్ ఉన్నాయని లెక్కలు వేసుకొని చూడను. అవన్నీ సినిమాకి అదనపు నగిషీల వంటివే. ఏ సినిమా కధకైనా భావోద్వేగం చాలా ముఖ్యం. కనుక దర్శకులు నా వద్దకి వచ్చి కధ చెపుతున్నప్పుడు దానిలో ఎంత డెప్త్, ఎంత ఎమ్మోషన్ ఉందనేది చూస్తాను. మరో విదంగా చెప్పాలంటే నేను ఆ కధని ప్రేక్షకుల కోణంలో నుంచి ఊహించి చూసుకొంటాను. అది ప్రేక్షకులకు నచ్చుతుందని గట్టిగా నమ్మితేనే సినిమా చేస్తాను. నా వీరాభిమాని బాబీ ఈ సినిమా కధ చెపుతున్నప్పుడే నాకు ఇది నా అభిమానుల సినిమా అని అర్దమైపోయింది. అందుకే షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను,” అని చెప్పారు. 

“సినిమాలలో డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్‌తో ఏవిదంగా వ్యవహరిస్తారు?” అనే ప్రశ్నకి చిరంజీవి సమాధానం చెపుతూ, “ఒకసారి కధ ఒకే అనుకొని సినిమా షూటింగ్‌ మొదలుపెట్టాక ఇక నేను వారి పనిలో వేలుపెట్టను. వారు ఎలా చేయమని చెపితే అలా చేసుకుపోతుంటాను తప్ప ఎదురు ప్రశ్నించను. ఒకవేళ ఆ షాట్ సరిగ్గా రాలేదని చెపితే మళ్ళీ మళ్ళీ వారికి తృప్తి కలిగేవరకు చేస్తూనే ఉంటాను. వాళ్ళ చేత షాట్ ఒకే అనిపించుకొన్నాకనే సెట్స్‌ నుంచి బయటకి వెళతాను. ఈ విషయంలో నేను నా మొదటి సినిమాలో ఏవిదంగా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను. అందుకే ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు అందరూ నన్ను అభిమానిస్తుంటారు. వారి కోసం నేను ఇంకా ఎంత కష్టపడటానికైనా సిద్దం. ఈ విషయంలో మావంటి నటులందరికీ అమితాబ్ బచ్చన్ ఆదర్శం,” అని అన్నారు.   

“గొప్ప నటుడిగా ఉండాలనుకొంటున్నారా లేక మంచి మనిషిగా గుర్తింపు పొందాలనుకొంటున్నారా?” అనే ప్రశ్నకి “మంచి నటుడు అనిపించుకోవడం ఓ వరమే. కానీ అది శాశ్వితం కాదని భావిస్తాను. కానీ మంచితనం అనేది మనం జీవించి ఉన్నా లేకున్నా మన గురించి అందరూ తలుచుకొనేలా చేస్తుంది. కనుక మంచి మనిషిగానే ఉండాలనుకొంటున్నాను. వీలైతే రియల్ హీరోగా ఉంటూ రీల్ హీరోగా ఎక్కువ కాలం ఉండాలని కోరుకొంటున్నాను,” అని చిరంజీవి జవాబిచ్చారు. 

“ఇంత సీనియర్ హీరో అయిన మీరు ఇంత అణకువగా ఉండాల్సిన అవసరం ఉందా? కొత్త హీరోలు కూడా మీలాగే ఉండాలని అనుకొంటున్నారా?” అనే ప్రశ్నకి “కొందరికి ఇలా ఉండటం సహజంగానే వస్తుంది. కనుక అందుకు భిన్నంగా వ్యవహరించడమే చాలా కష్టం. నాకూ అంతే! సినిమా అంటే దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులు, టెక్నికల్ టీం, ఇంకా చాలా మంది ఉంటారు. కనుక మనం వారందరి కోసం కూడా ఆలోచించాలి. మన ప్రవర్తన, మాట తీరు సరిగ్గా ఉంటే అన్ని బాగుంటాయని నేను నమ్ముతాను. ఇంతకాలం నేను ఇండస్ట్రీలో ఉండగలిగానంటే నా ప్రవర్తనే కారణం. అందుకే నాకు వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాను. నేను పనిలేకుండా ఎప్పుడూ లేను. అలా ఉండలేను కూడా. యువనటులలో నాకు తెలీని అనేక విషయాలు కనిపిస్తుంటాయి. కనుక వారి నుంచి కూడా అనేక కొత్తవిషయాలు నేర్చుకొంటాను. నేను పెద్దగా చదువుకోలేదు కానీ నా చుట్టూ ఉన్నసమాజాన్ని అందులో జరిగే ప్రతీ సంఘటనలని చూసి కొత్తకొత్త విషయాలు నేర్చుకొంటుంటాను,” అని చిరంజీవి చెప్పారు.

Related Post