మేడారంకు పోటెత్తిన భక్తులు

January 17, 2026
img

సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓడిశా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్  రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. పండుగ సెలవులు ముగుస్తుం’డటంతో నిన్న ఒక్కరోజే సుమారు 6 లక్షలు పైగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. 

ఆకస్మికంగా భక్తుల రద్దీ పెరగడంతో ములుగు జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్ అధ్వర్యంలో భారీగా పోలీసులు మొహరించి ఎక్కడా తొక్కిసలాట జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఈ నెల 28 నుంచి నలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరుగబోతోంది. ఈ నాలుగు రోజులలో సుమారు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. కనుక జిల్లా అధికారులు అందుకు తగినట్లుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మహా జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక దాదాపు నెల రోజుల నుంచి భక్తులు వచ్చి వనదేవతల గద్దెలు దర్శనం చేసుకొని వెళుతున్నారు. 

అదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలో హరిత గ్రాండ్ హోటల్లో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని నిర్మాణ పనులను పరిశీలిస్తారు. కనుక భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related Post