కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని చడ్చన పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దోపిడీ జరిగింది. మంగళవారం సాయంత్రం కొందరు దొంగలు మొహాలకు ముసుగులు ధరించి, చేతిలో తుపాకులు, కత్తులతో బ్యాంకులోకి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి లాకర్లలో ఉన్న 50 కేజీల బంగారం, రూ.8 కోట్లు నగదు దోచుకొని కారులో పారిపోయారు.
దొంగలు మిలటరీ యూనిఫారంలు ధరించి లోనికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారు నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్ళి అదుపులో తీసుకొని అత్యవసర పరిస్థితిలో పోలీసులను అప్రమత్తం చేసేందుకు అలారం యాక్టివేట్ చేయకుండా అడ్డుకున్నారు. మిగిలిన దొంగలు సిబ్బందిని బెదిరిస్తూ దోపిడీ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా వారు వెళ్ళిన దారిలో గాలింపు చేపట్టారు. దొంగలు కర్ణాటక నుంచి మహారాష్ట్రవైపు వెళ్ళినట్లు గుర్తించి ప్రత్యేక పోలీస్ బృందాలను పంపించారు.