హైడ్రా సిబ్బంది ధర్నా!

September 17, 2025
img

హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం ఉదయం మెరుపు ధర్నా చేపట్టారు. ఈరోజు ఉదయం విధులు బహిష్కరించి నగరంలో బుద్ధ భవన్‌ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాలలో ఏకంగా రూ.5,000 చొప్పున కోసి చేతిలో పెట్టాడాన్ని నిరసిస్తూ వారు ధర్నా చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 1100 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం హైడ్రాలోకి బదిలీ చేసింది. అప్పటి నుంచి వారు హైడ్రాలో డీఆర్ఎఎఫ్‌ విభాగంలో పనిచేస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వంఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన వేతానాలు చెల్లించాలని జీవో జారీ చేసింది. దాని ప్రకారం హైడ్రా సిబ్బందికి అదనంగా రూ. 5,000 చెల్లిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారి జీతాలలో ఆ మేరకు కోత విధించారు. దీనినే హైడ్రా సిబ్బంది నిరసిస్తూ నేడు మెరుపు ధర్నా చేపట్టారు.

ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు తాము రేయింబవళ్ళు ఆ వర్షంలో తడుస్తూ ఎంతో కష్టపడి పనిచేశామని అందుకు ప్రతిఫలం ఇదా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తామేమీ జీతాలు పెంచమని అడగడం లేదని తమకు కోత విధించిన జీతం తిరిగి చెల్లించాలన్నారు. తాము పై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో నేడు ధర్నా చేయాల్సివచ్చిందని చెప్పారు.

కనుక తక్షణం తమకు కోసుకున్న జీతాలను తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

Related Post