యాక్షన్ సీన్ షూటింగ్‌లో స్టంట్ మ్యాన్ మృతి

July 15, 2025
img

కోలీవుడ్‌లో ఓ విషాద ఘటన జరిగింది. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తీస్తున్న వేట్టువం సినిమా షూటింగ్‌ తమిళనాడులోని నాగపట్నం సమీపంలో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఓ కార్ ఛేజింగ్ సన్నివేశం షూటింగ్‌లో పాల్గొంటునప్పుడు స్టంట్ మ్యాన్ మోహన్ రాజ్ (రాజు) (52)కి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన డ్రైవ్ చేస్తున్న వాహనం అదుపు తప్పి గాల్లో ఎగిరిపడింది.

ఆ సన్నివేశంలో గాల్లో ఎగిరి దూసుకుపోయేందుకు అక్కడ చక్కబల్లలతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. రాజు డ్రైవ్ చేస్తున్న వాహనం దానిపై నుంచే వేగంగా దూసుకుపోయి గాల్లోకి లేచింది. కానీ వేగంగా నేలపై దిగి దూసుకుపోవాల్సిన వాహనం గాల్లో పల్టీ కొట్టి కిందపడిపోయింది.

యూనిట్ సభ్యులు పరుగున అక్కడకి వెళ్ళి వాహనంలో నుంచి రాజుని బయటకు తీసి హుటాహుటిన అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయారని వైద్యులు చెప్పారు.

యాక్షన్ సీన్ మొదలుపెట్టేముందు కూడా రాజుతో తాము మాట్లాడామని, ఆయన కూడా సీన్ ఏవిదంగా చేయాలో అడిగి తెలుసుకున్నారని యూనిట్ సభ్యులు చెప్పారు. గతంలో ఆయన ఇలాంటి కార్ ఛేజింగ్ సీన్స్ చాలా చేసి ఉన్నందున ఎవరూ భయపడలేదన్నారు.

కానీ వాహనం డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు రావడం క్షణం వ్యవధిలోనే చనిపోవడం తమని చాలా కలచివేసిందని పా రంజిత్, ఆర్య, యూనిట్ సభ్యులు, చిత్ర నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, రాజు కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. 

Related Post