అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉండగానే ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఆరుగురు ఉండగా వారిలో ఐదుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ ఈరోజు తెల్లవారు జామున 5.20 గంటలకు డెహ్రాడూన్ నుంచి గుప్తకాశీ (కేదార్‌నాధ్) వెళుతుండగా గౌరీ కుండ్ సమీపంలో కూలిపోయింది. హటాత్తుగా వాతావరణం మారడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి తీవ్ర దిగ్బ్రాంతి, సంతాపం తెలిపారు. ఇటీవల కాలంలో ఇది మూడో హెలికాఫ్టర్ ప్రమాదం. కనుక ఇకపై హెలికాఫ్టర్ సేవల విషయంలో అనుసరించాల్సిన విదివిధానాలను తూచా తప్పకుండా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు.