హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025లో పాల్గొనేందుకు 110 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు నేడు చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్‌లో పాల్గొంటారు. వారిని ప్రత్యేకమైన ఏసీ బస్సులో అక్కడకు తీసుకువస్తారు. వారు స్థానిక ప్రజలు, వ్యాపారులతో మాట్లాడి తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. అనంతరం వారు లాడ్ బజార్‌లో షాపింగ్ చేస్తారు.
కనుక పాతబస్తీలో ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ఆంక్షలు విధించి, భారీగా పోలీసులను మోహరించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు రోడ్లకు మరమత్తులు చేసి, ఆ ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
పాతబస్తీలో కార్యక్రమాలు ముగినసిన తర్వాత ప్రపంచ దేశాల సుందరీమణులు అందరూ చౌమహల్లా ప్యాలస్ చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవార్ధం విందు ఏర్పాటు చేస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు ఈ విందులో పాల్గొంటారు.