భారత్-పాక్ ఘర్షణలలో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం కళ్ళి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత తదితరులు కళ్ళి తండాకు వెళ్ళి మురళీ నాయక్ తల్లితండ్రులను ఓదార్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఆయన శవ పేటికని మోశారు. అంత్యక్రియలలో కూడా పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి రూ.50 లక్షల నగదు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాలు ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే తన సొంత నిధుల నుంచి మరో రూ.25 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణలో కూడా అధికార ప్రతిపక్ష నాయకులు అమర జవాన్ మురళీ నాయక్ చిత్ర పటం పెట్టి ఘనంగా నివాళులు అర్పించారు.