తెలంగాణలో మరో రెండు రోజులు వానలు

April 19, 2025
img

హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో శని,ఆదివారం రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

హైదరాబాద్‌లో శుక్రవారం మద్యాహ్నం వరకు ఎండ, వడగాడ్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం అయ్యేసరికి నగరంపై దట్టమైన మేఘాలు కమ్ముకొని చల్లగాలులు వీయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

ఆ తర్వాత పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మద్యాహ్నం ఎండ వేడికి ఇబ్బంది పడిన నగర ప్రజలు సాయంత్రం వర్షం వలన ఇబ్బంది పడ్డారు. సరిగ్గా సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్ళకు తిరిగి బయలుదేరే సమయంలో వర్షం మొదలవడంతో ఎప్పటిలాగే రోడ్లపై వర్షం నీళ్ళు నిలిచిపోయి ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో కాచిగూడ, నారాయణ గూడ, చిక్కడపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్‌,  హయత్ నగర్‌, ఎస్సార్ నగర్‌, కోఠీ, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్ పేట, యూసఫ్ గూడా, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. 

మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడి, దక్షిణ, నైరుతీ దిశగా బలమైన గాలులు వీస్తునందున నేడు, రేపు హైదరాబాద్‌తో సహ తెలంగాణలో పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అకాల వర్షాల కారణం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

Related Post