అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) లక్నోలోని ఓ హాస్పిటల్లో కన్ను మూశారు. వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో పాటు హైబీపి, షుగర్ వ్యాధులతో ఆయన చాలలా కాలంగా బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ బుధవారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తుది శ్వాస విడిచారు.
ఆచార్య సత్యేంద్ర దాస్ బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండేవారు. 20 ఏళ్ళ వయసులో నిర్వాణీ ఆఖడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తూ అయోధ్య శ్రీరాముడు చెంతకు చేరుకున్నారు.
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మించక మునుపు బాబ్రీ మసీదు పక్కనే రామ్ లల్లా ఆలయం ఉండేది. అప్పటి నుంచే ఆయన దానికి పూజారిగా ఉండేవారు. అంటే దాదాపు మూడున్నర దశాబ్ధాలుగా శ్రీరాముడి సేవ చేసుకున్న ధన్యజీవి ఆచార్య సత్యేంద్ర దాస్. చివరి క్షణం వరకు రామనామ స్మరణ చేస్తూ ఆ భగవంతుడిలోనే లీనమైపోయారు.
ఆయన మృతిపట్ల ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు, మఠాధిపతులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.