ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటంతో ఇప్పుడు దేశంలో ఎవరూ ఊహించని విదంగా మోసాలు జరుగుతున్నాయి. మన కుటుంబ సభ్యులో, ఆత్మీయులో వీడియో కాల్ చేసి ‘పెద్ద సమస్యలో చిక్కుకున్నాను అర్జెంటుగా డబ్బు పంపమని’ అడిగితే మరో ఆలోచన లేకుండా పంపిస్తాము.
కానీ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీని వాడుకొని మన ఆత్మీయుల ఫోటో లేదా వీడియోలతో ఆవిదంగా వారే స్వయంగా మాట్లాడుతున్నట్లు వీడియో సృష్టించి సైబర్ నేరగాళ్ళు డబ్బులు దోచేస్తున్నారు. కనుక ఎంత ఆత్మీయులైనా ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోవాలని సైబర్ పోలీస్ సూచిస్తున్నారు.
ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ మోసాలు జరిగేవి. వాటి గురించి అందరికీ తెలిసిపోవడంతో నేరగాళ్ళు మరో కొత్త రకంగా ప్రజలను మోసగిస్తున్నారని వికారాబాద్ జిల్లా రేగడి మైలారం గ్రామంలో బయటపడింది.
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్యామలయ్య గౌడ్ చిన్న కొడుకు సత్యనారాయణ గౌడ్ భార్యా పిల్లలతో హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ పోలీస్ హిందీలో మాట్లాడుతూ “నీ కొడుకు సత్యనారాయణ గౌడ్ ఓ మైనర్ బాలిక రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. వెంటనే 50 వేలు ఫోన్ పేలో పంపించు. లేకుంటే జైలుకి పోతాడు. ఆ తర్వాత మరెన్నటికీ బయటకురాలేడు,” అంటూ చెప్పాడు.
అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వెనుక పోలీస్ సైరన్ కూడా వినిపిస్తుండటంతో శ్యామలయ్య గౌడ్ తీవ్ర ఆందోళనతో అక్కడే ఉన్న ఓ యువకుడుకి ఇచ్చి వివరాలు తెలుసుకోమని కోరాడు.
అతను “సత్యనారాయణ గౌడ్ ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు?మీ పేరు ఏమిటి?” అంటూ ప్రశ్నించేసరికి అవతలి వ్యక్తికి కోపంగా అరుస్తూ ఫోన్ పెట్టేశాడు.
శ్యామలయ్య గౌడ్ వెంటనే కొడుకుకి వీడియో కాల్ చేయగా, అతను తన ఆఫీసులో పనిచేసుకుంటూ కనిపించాడు. అప్పుడు గానీ శ్యామలయ్య గౌడ్ మనసు కుదుట పడలేదు. వెంటనే సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు.
కనుక ఇలాంటి రకరకాల మోసాల గురించి ప్రజలు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం లేకుంటే ఉన్న డబ్బు అంతా ఊడ్చుకుపోతుంది.