తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న ఇండిగో విమానం

December 01, 2024
img

ఈరోజు ఉదయం ఇండిగో సంస్థకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం తప్పించుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను కారణంగా చెన్నై నగరంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రన్ వేపైకి నీళ్ళు చేరాయి. దీంతో కొన్ని గంటల పాటు విమానాల రాకపోకలు నిలిపివేసి పరిస్థితి మెరుగుపడిన తర్వాత మళ్ళీ విమానాల రాకపోకలను అనుమాటిస్తున్నారు. 

ఈరోజు ఉదయం ఇండిగో విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా, భీకరమైన తుఫాను గాలులు తీవ్రత కారణంగా రన్ వేపై నుంచి కాస్త పక్కకు జారింది. కానీ పైలట్లు చాలా చురుకుగా స్పందించి మళ్ళీ విమానాన్ని టేకాఫ్ చేసి గాల్లోకి తీసుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఒకవేళ ఆ క్షణంలో పైలట్లు ఆ నిర్ణయం తీసుకోకుండా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. విమానం గాల్లో లేచిన తర్వాత మళ్ళీ మరోసారి రన్ వేపై భద్రంగా ల్యాండింగ్ అవడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది, విమానాశ్రయంలో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.       

Related Post