కరీంనగర్‌లో పట్టపగలు బంగారు దుకాణంలో దోపిడీ!

May 03, 2026
img

అదివారం ఉదయం కరీంనగర్‌లో ఓ బంగారు దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, స్థానిక జ్యోతీ నగర్‌లోని పిఎంజె జ్యూవెలరీ షాపు ఉదయం 10 గంటలకు తెరిచారు. సిబ్బంది లాకర్‌లో నుంచి బంగారు ఆభరణాలు బయటకు తీసి షో కేసులలో సర్డుతున్నప్పుడు హటాత్తుగా ఆరుగురు దుండగులు లోనికి ప్రవేశించి తుపాకులతో వారిపై కాల్పులు జరిపారు.

వారిని అడ్డుకోబోయిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వారిలో ఇద్దరు తుపాకులు చూపి సిబ్బందిని బెదిరిస్తూ తాడుతో బందించారు. మిగిలిన వారు బంగారు ఆభరణాలను సంచీలో పోసుకున్నారు. కేవలం 20 నిమిషాలలోనే వారు షాపులో అందుబాటులో ఉన్న బంగారు ఆభరణాలన్నీ దోచుకొని బయట సిద్దంగా ఉన్న ద్విచక్ర వాహనాలపై పారిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సిసి కెమెరా రికార్డింగ్ ఆధారంగా దొంగలను గుర్తించి, వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. దొంగల కాల్పులలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

సాధారణంగా యూపీ, బిహార్ రాష్ట్రాలకు నుంచి వచ్చే దొంగలే ఈవిధంగా తుపాకులతో కాల్పులు జరిపి దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. కనుక ఇది ఉత్తరాది గ్యాంగుల పనే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. సెలవు దినం అదివారం ఉదయం షాపు తెరిచిన వెంటనే కేవలం 20 నిమిషాలలో దోపిడీ చేయడాన్ని బట్టి వారు ముందుగా రెక్కీ నిర్వహించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related Post