ఏపీ డెప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవగా వెంటనే ఆస్పత్రిలో చేరగా వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారని వార్త అందరూ చూశారు. కానీ ఆయనకు ఎటువంటి అనారోగ్యం కలిగిందో, దేనికి శస్త్ర చికిత్స చేయించుకున్నారనే విషయం రహస్యంగా ఉంచడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆయన ఆరోగ్య సమస్య, జరిగిన శస్త్ర చికిత్స, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం బయటకు వచ్చింది.
ఆయనకు ముక్కుకు సంబంధించి ‘సైనస్’ సమస్య చాలా కాలంగా ఉంది. కానీ పని ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకోకపోవడంతో దాని వలన ఇన్ఫెక్షన్ ఏర్పడి కంటి చూపుకి ఇబ్బంది మొదలైంది.
వెంటనే ఆస్పత్రిలో చేరితే వైద్యులు ఫంక్షనల్ ఎండోస్కోపీ సైనస్ సర్జరీ (ఫేస్) చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. కానీ ఇప్పటికీ ముక్కు నుంచి కొద్దిగా రక్తం కారుతోందని, కొన్ని రోజుల తర్వాత పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెప్పారని పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్య, ప్రస్తుత పరిస్థితి గురించి సిఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు.