మేడారం హుండీ ఆదాయం: రూ.8 కోట్లు

February 08, 2026
img

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ఏర్పాటు చేసిన 828 హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం    హనుమకొండలోని టిటిడీ కళ్యాణ మండపంలో మూడు రోజులుగా సాగుతోంది. నిన్న మూడవ రోజున 140 హుండీలు తెరిచి లెక్కించగా మొత్తం రూ.2 కోట్లు పైన ఆదాయం వచ్చింది. ఇది కాక రూ.71,823 విలువగల విదేశీ కరెన్సీ కూడా వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం రూ.8.06 కోట్లు హుండీల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన మిగిలిన హుండీలన్నిటిలో కలిపి మరో రూ.10-12 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.      

భక్తులు హుండీలలో నగదుతో పాటు వెండి బంగారు ఆభరణాలు వనదేవతలకు కానుకలుగా సమర్పించుకున్నారు. ప్రస్తుతం వాటిని వేరు చేసి బరువు తూచి ఆ వివరాలు రికార్డులో నమోదు చేస్తున్నారు. హుండీలలో ఎప్పుడో రద్దు చేసిన 1,000, 500 నోట్లు కూడా భక్తులు వేశారు. కొందరు భక్తులు తమ ప్రేమ ఫలించాలంటూ వ్రాసిన లేఖలు, తమ ఆస్తి వివాదాలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు హుండీలలో వేశారు.

మిగిలిన హుండీల ఆదాయం లెక్కించడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టవచ్చని ఈ లెక్కింపుని పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి కృష్ణ ప్రసాద్ చెప్పారు. 

Related Post