బోనాల పండుగలో భాగంగా ఈ నెల 13న (ఆదివారం) సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవం జరుగబోతోంది. రాష్ట్ర ప్రజల తరపున సిఎం రేవంత్ రెడ్డి దంపతులు అమ్మవారికి లష్కర్ బోనం సమర్పిస్తారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, ఇంకా వివిద పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించుకోవడానికి నిత్యం వేలాదిమంది మహిళలు తరలివస్తున్నారు. కనుక భక్తుల సౌకర్యార్ధం ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో వాహనాలను నియంత్రిస్తూ వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు. ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆలయ పరిసరాలలో 2,500 మంది పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
ఆదివారం ఉదయం నుంచి సోమవారం మద్యాహ్నం వరకు శివసత్తులు, జోగినులకు అమ్మవారి దర్శనం, పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న (సోమవారం) అమ్మవారి ఆలయ ఆవరణలో భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది.