మా తాత మహా రసికుడు: చిరంజీవి

February 12, 2025
img

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, తన కుమారుడు గౌతమ్‌ రాజా తాత మనవాళ్ళుగా నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవికి ఆయన తాతగారి ఫోటో చూపించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పమని అడగగా, చిరంజీవి చెప్పిన సమాధానం విని అందరూ గొల్లున నవ్వారు. 

చిరంజీవి (తల్లి అంజలి తండ్రి) తాత పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు నుంచి వచ్చి మొగల్తూరులో స్థిరపడ్డారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే మహా రసికుడు. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. బయట ఓ పేద మహిళని కూడా చేరదీశారు. వీరు ముగ్గురు కాకుండా మరో ఇద్దరో ముగ్గురో ఉన్నారేమో నాకు తెలియదు. కనుక మా చిన్నప్పుడు అమ్మ 'మీకు ఎవరి బుద్దులు వచ్చినా పర్లేదు కానీ మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదురా' అంటుండేది,” అని చిరంజీవి చెప్పినప్పుడు అందరూ నవ్వారు. 

ఇక తాతా మనవడి ప్రస్తావన వచ్చింది కనుక తన ఇంట్లో పరిస్థితి గురించి సరదాగా చెపుతూ, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళతో ఇల్లు లేడీస్ హాస్టల్లా దానికి నేను వార్డెన్ అన్నట్లు నాకు అనిపిస్తుంటుంది. రామ్ చరణ్‌ కూడా అమ్మాయినే కన్నాడు. తర్వాత మరో అమ్మాయిని కంటాడే అని భయంగా ఉంది. ఓ మగ పిల్లడిని కంటే మాకు ఓ వారసుడు దొరుకుతాడు,” అని అన్నారు. చిరంజీవి ఇది కూడా సరదాగానే అన్నారు. కానీ ఆడపిల్లలు వారసులు కారా? ఆడపిల్లలంటే చిరంజీవికి అంత చులకనా? అంటూ అప్పుడే కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు కనుక ఓ మగపిల్లాడు ఉంటే బాగుంటుందని చిరంజీవి ఆ మాట అన్నారు. మన దేశంలో తల్లి తండ్రులు కొడుకు పుట్టాలని కోరుకోవడం సర్వసాధారణ విషయం. ఓ తండ్రిగా చిరంజీవి కూడా కోరుకున్నారు. అదేమీ తప్పు కాదు. కోడిగుడ్డుకి ఈకలు పీకిన్నట్లు దానికి పెడర్ధాలు తీయాల్సిన అవసరం లేదు.            

Related Post