టిజిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు నేటి నుంచి సమ్మె చేస్తామంటూ సమ్మె నోటీస్ ఇవ్వగా రేపు (సోమవారం) తన కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలకు రావాలని లేబర్ కమీషనర్ వారికి లేఖ వ్రాశారు. దానిపై కార్మిక సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము రెండు వారాల క్రితం సమ్మె నోటీస్ ఇస్తే ఇంతవరకు స్పందించకుండా సమ్మె మొదలుపెడుతున్నప్పుడు చర్చలకు ఆహ్వానించడాన్ని ఏవిదంగా భావించాలని ప్రశ్నించారు.
టిజిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్. బాబు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే గత ప్రభుత్వం వీసీ సజ్జనార్‌ని టిజిఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆయన ధోరణి మారలేదు.
ఆయన ఎండీగా నియామితులైనప్పటి నుంచి మా కార్మికులకు, సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా జీతాలు పెంచేందుకు ఇష్టపడని ఆయన కన్సల్టెంట్స్‌కు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. మా సమస్యలను, సూచనలను పట్టించుకోకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ధోరణి వల్లనే మేము సమ్మెకు పిలుపునీయవలసి వచ్చింది,” అని ఆరోపించారు.