మంచు కుటుంబంలో మళ్ళీ అలజడి!

January 15, 2025
img

మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్ళీ ఈరోజు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి తిరుపతిలోని రంగంపేట వద్దగల మోహన్ బాబు యూనివర్శిటీకి వచ్చారు. 

ఈరోజు ఉదయం వారిరువూరూ రేణిగుంట విమానాశ్రయం చేరుకునేసరికి అక్కడ వారి అనుచరులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారందరూ బైక్ ర్యాలీతో మంచు మనోజ్ దంపతులను మోహన్ బాబు యూనివర్శిటీకి వచ్చారు. 

వారు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న యూనివర్సిటీ సిబ్బంది ప్రధాన ద్వారాన్ని మూసి వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని యూనివర్సిటీకి వచ్చిన మంచు మనోజ్ దంపతులను అడ్డుకున్నారు. 

వారిరువురినీ లోనికి అనుమతించవద్దంటూ మోహన్ బాబు ఇదివరకే హైకోర్టులో పిటిషన్‌ వేసి కోర్టు నుంచి అందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పోలీసులు హైకోర్టు ఉత్తర్వులను మనోజ్ దంపతులకు చూపించి, లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే అది కోర్టు ధిక్కారం కేసవుతుందని, అరెస్ట్‌ చేయాల్సి వస్తుందని చెప్పడంతో వారు ఇక చేసేదేమీలేక అక్కడి నుంచి నారావారి పల్లెకు వెళ్ళి అక్కడ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్‌, వారి కుటుంబ సభ్యులని పలకరించి వారితో కాసేపు గడిపిన తర్వాత రంగంపేట ఊర్లో కనుమ పండుగ సందర్భంగా జరిగే ఉత్సవంలో పాల్గొన్నారు.  

సంక్రాంతి పండుగ సందర్భంగా తాము ఆవరణలో ఉన్న తన తాత నారాయణ స్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మ దంపతుల సమాధుల వద్ద పూలు, పళ్ళు, బట్టలు పెట్టి శ్రద్దాంజలి ఘటించేందుకు వచ్చామని కానీ తమని పోలీసులు లోనికి అనుమతించలేదని మంచు మనోజ్ చెప్పారు. 


Related Post