జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆ ప్రాంతంలోని మందుబాబులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగబోతోంది. కనుక రెండు రోజుల ముందుగానే అంటే నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచే నియోజకవర్గం పరిధిలో అన్ని వైన్ షాప్స్, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ళలోని బార్లు మూసివేయాలని ఆదేశిస్తూ నగర కమీషనర్ అవినాష్ మొహంతీ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. మళ్ళీ నవంబర్ 11 సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయ్యేవరకు మూసి ఉంచాలని ఆదేశించారు.
మళ్ళీ నవంబర్ 14న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు వైన్ షాపులు అన్నీ మూసివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సజావుగా సాగేందుకుగాను ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొంటూ అందరూ తూచాతప్పకుండా ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.