నేడు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామున స్వామివారిని సూర్యప్రభ వాహనంలో మాడవీధుల్లో ఊరేగించారు. రథసప్తమి రోజున స్వామివారిని సూర్యప్రభ వాహనంలో దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.
పొరుగు రాష్ట్రం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లిలో సుప్రసిద్ధ సూర్యనారాయణ మూర్తి ఆలయం ఉంది. ఈరోజు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం రాత్రి నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూకట్టారు.
అర్దరాత్రి 12.30 గంటలకు అరసవెల్లి ఆలయంలో సుప్రభాత సేవ, తర్వాత మహాక్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు మొదలై ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. తర్వాత స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈరోజు ఉదయం సూర్యకిరణాలు గర్భగుడిలో స్వామివారి పాదాలపై పడితే చూసి తరించాలని దూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు.