తగ్గేదేలే: వేమూరి రాధాకృష్ణ

January 25, 2026
img

సింగరేణి టెండర్ల విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా విషపు రాతలు వ్రాశారంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి వ్రాసినవి అన్నీ తప్పుడు రాతలేనని ఆంధ్రజ్యోతిలో ప్రకటన వేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంత గట్టిగా చెప్పడంతో వేమూరి రాధాకృష్ణ ఏవిధంగా స్పందిస్తారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. 

శనివారం రాత్రి మళ్ళీ ఆదివారం ఉదయం ఏబీఎన్ న్యూస్ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘వీకెండ్ కామెంట్‌ బై ఆర్కే’లో ఆయన ‘తగ్గేదేలే’ అని స్పష్టం చేశారు. 

తను వ్రాసిన ప్రతీ అక్షరానికి కట్టుబడి ఉన్నానని కావాలంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనకు లీగల్ నోటీస్ పంపించవచ్చనట్లు దానిలో పేర్కొన్నారు. 

రూ.1600 కోట్లు విలువైన నైని బ్లాక్ గనులు దక్కించుకునేందుకు ఇద్దరు మంత్రులు, ఎన్టీవీ చౌదరీ జరిపిన తతంగం అంతా వాస్తవమే అని వేమూరి రాధాకృష్ణ కుండ బద్దలు కొట్టారు.

ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మీడియా ప్రశ్నిస్తే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా ఎప్పుడో చనిపోయిన వైఎస్ఆర్ గురించి, కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?ఎందుకు నాపై ఎదురుదాడి చేస్తున్నారని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు. 

ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేయడం, మద్యలో కులాల ప్రస్తావన తెచ్చి అసలు విషయాన్నీ పక్కదారి పట్టించడం నాడు వైఎస్ఆర్ హయంలోనే ప్రారంభించారని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన శిష్యుడునని చెప్పుకుంటున్నారు కనుక అదేవిధంగా స్పందించారని వేమూరి రాధాకృష్ణ ఆక్షేపించారు. 

సింగరేణి టెండర్ల వ్యవహారం గురించి తాను బయట పెట్టి చేసిన విమర్శలతో సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. 

వేమూరి రాధాకృష్ణ నుంచి క్షమాపణలకు బదులు ఘాటుగా జవాబు వచ్చేసింది కనుక ఇప్పుడు బంతి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోర్టులోనే ఉంది. దీనిపై ఆయనేవిధంగా స్పందిస్తారో? 

Related Post