శనివారం సాయంత్రం హైదరాబాద్, నాంపల్లి వద్ద గల ఫర్నీచర్ క్యసిల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది 10 ఫెయిర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు అంతస్తుల గల భవనంలో గ్రౌండ్ ఫ్లోరులో ఫర్నీచర్ షో రూములో మొదట మంటలు మొదలయ్యాయి.
షో రూములో కర్ర, ప్లాస్టిక్‌తో చేసిన ఫర్నీచర్ ఎక్కువగా ఉన్నందున శరవేగంగా మంటలు షో రూమ్ అంతటా వ్యాపించాయి. పరిసర ప్రాంతాలలో దట్టమైన నల్లటి పొగ వ్యాపించడంతో పై అంతస్తులలో నివసిస్తున్న మూడు కుటుంబాలను సురక్షితంగా కిందకు తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది క్రేన్లు తెప్పించారు.
అలాగే సెల్లార్‌లో వాచ్ మ్యాన్ దంపతులు, వారి ఇద్దరి పిల్లలు అఖిల్ (11), ప్రణీత్ (7) నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరూ ఇంకా సెల్లార్‌లో తమ నివాసంలోనే చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వారినీ సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వారి తల్లి తండ్రులు ఇద్దరూ పని మీద బయటకు వెళ్ళడం వలన వారికి ఇంకా ఈ సమాచారం అందలేదు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను వేరే మార్గంలోకి మళ్ళిస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా గందరగోళంగా ఉన్నందున నుమాయిష్ కోసం బయలుదేరిన వారు ఈరోజుకి వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.