తొమ్మిది రోజులుగా పూజలందుకున్న ఖైరతాబాద్, బాలాపూర్ వినాయక విగ్రహాలను నేడు నిమజ్జనం చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటలోగా ఈ రెండు విగ్రహాలు నిమజ్జనం చేయాలని ముందే నిర్ణయించికున్నందున, ఈరోజు ఉదయం 6 గంటలకే ఉత్సవ కమిటీ సభ్యులు కలశపూజ పూర్తిచేశారు.
మరికాసేపట్లో బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట మొదలవుతుంది. అది ముగియగానే గణేశ్ శోభాయత్ర మొదలవుతుంది. ఉదయం 8 గంటలకే ఖైరతాబాద్ గణేశుని శోభాయత్ర మొదలయింది.
ట్రాఫిక్ పోలీస్ శాఖ ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తోంది. కనుక ట్యాంక్ బండ్ వద్ద కూడా భారీ క్రేన్స్ గణేశ్ నిమజ్జనం కోసం సిద్దంగా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈరోజు ఉదయం 6 గంటల నుంచే నగరంలో వేలాది వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగుతోంది.
ఈ కార్యక్రమం కోసం మొత్తం 29,000 మంది పోలీసులు, 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు, 20,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నారు. నగరంలో 10,000 సిసి కెమెరాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవికాక ప్రధాన ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.