ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మైత్రీ మూవీ మేకర్స్‌కి లీగల్ నోటీస్ పంపారు. ఆ సంస్థ అజిత్ కుమార్ హీరోగా తీసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తన అనుమతి తీసుకోకుండా తాను సంగీతం సమకూర్చిన పాత పాటని ఉపయోగించినందుకు రూ.5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ నోటీస్ పంపారు.
తక్షణం రూ.5 కోట్లు నష్ట పరిహారం చెల్లించి, వారం రోజులలోగా ఆ సినిమాలో తన పాటని తొలగించాలని కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు కే. త్యాగరాజన్, ఏ. శరవణన్ మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసు వేశారు.
ఇళయరాజా నుంచి నోటీస్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాట ఇళయరాజా సొంతం కాదని, ఆ పాట తీసిన సదరు సినీ నిర్మాతకు మాత్రమే హక్కు ఉంటుందని, వారి నుంచి తాము ముందస్తు అనుమతి తీసుకొని పాటని తమ సినిమాలో వాడుకున్నామని జవాబిచ్చినట్లు తెలుస్తోంది. కనుక మైత్రీ మూవీ మేకర్స్‌తో ఇళయరాజా న్యాయపోరాటం మొదలుపెట్టడం ఖాయమే.
గతంలో ఆయన ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కూడా ఇలాగే వ్యవహరించి విమర్శలకు గురయ్యారు. కానీ నేటికీ ఇళయరాజా వైఖరిలో ఎటువంటి మార్పురాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత డబ్బు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఇళయరాజాకి ఈ వయసులో ఈ గొడవలు అవసరమా... అని ప్రజలు అనుకోకుండా ఉంటారా?