బహుశః సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు... పటాన్‌చెరు వద్ద 65వ నంబర్ జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గురువారం రాత్రి నుంచి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జాతీయ రహదారి నీట మునిగింది. జిల్లా అధికారులు ఇరువైపులా బ్యారికేడ్లు అడ్డుగా పెట్టి వాహనాలను నిలిపివేశారు.
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రుద్రారం వరకు, అలాగే జిల్లా కేంద్రం నుంచి ఇస్నాపూర్ వరకు ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల మేర వాహానాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అంత భారీ వర్షంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ వాహనాలను పంపిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు కోస్తాంధ్ర-ఓడిశాకు మద్య తీరం దాటుతుంది. ఈ ప్రభావం తెలంగాణ అంతటా కనిపిస్తోంది.
హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు జిల్లాలలో నిన్నటి నుంచి కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం తప్పనిసరిగా రోడ్లపైకి వెళ్ళాల్సినవారు, ద్విచక్రవాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.