హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు త్వరలో మారబోతోంది. బుదవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఫ్లై ఓవర్ పేరుని తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని నిర్ణయించారు.
సుమారు ఒక కిలో మీటర్ పోడువుండే ఈ ఫ్లై ఓవర్‌కి ఇరువైపులా ఆర్చ్ నిర్మించి వాటిపై తెలంగాణ తల్లి బొమ్మ, ఫ్లై ఓవర్ పేరు ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదం కొరకు పంపుతుంది.
ప్రభుత్వ సూచన మేరకే ఈ ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు కనుక ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. కనుక త్వరలోనే తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మారనుంది. ఆర్చ్ నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కావచ్చు.
సమైక్య రాష్ట్రంలో ఈ ఫ్లై ఓవర్‌కు ‘తెలుగు తల్లి’ అని పేరు పెట్టారు. రాష్ట్రం విభజన జరిగి 11 ఏళ్ళు పైనే అయ్యింది. ఇంతవరకు అదే పేరుతో కొనసాగింది. ఇన్నేళ్ళ తర్వాత ఫ్లై ఓవర్ పేరుని తెలంగాణ తల్లిగా మార్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు.