పెళ్ళి చేసుకోమని అడిగినందుకు సజీవ దహనం

October 20, 2024
img

ఆంధ్రప్రదేశ్‌, వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలో దారుణం జరిగింది. ఇంటర్ ప్రధమ విద్యార్ధినిని ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి పారిపోయాడు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు చెప్పిన సమాచారం ప్రకారం, హంతకుడు విగ్నేష్ స్థానికంగా ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. పెళ్ళి అయ్యింది. అతని భార్య గర్భవతి కూడా.

అతని చేతిలో చనిపోయిన బాలిక (16)తో గత 5 ఏళ్ళుగా పరిచయం ఉంది. ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. అతనికి పెళ్ళి అయ్యిందని తెలిసి ఉన్నప్పటికీ అతనితో కలిసి తిరుగుతూ ఉండేది.

తనను పెళ్ళి చేసుకోమని తరచూ అడుగుతుండేది. ఆమెను కాలక్షేపం కోసం వాడుకోవాలనుకున్నాడే కానీ అతనికి ఆ ఉద్దేశ్యం లేదు. కానీ ఆమె పదేపదే పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మొన్న శుక్రవారం ఆమెకు ఫోన్‌ చేసి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మర్నాడు రమ్మనమని పిలిచాడు. 

అతను పెళ్ళి గురించే మాట్లాడుతాడని అనుకుని మర్నాడు ఉదయం ఆటోలో అతని వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి అదే ఆటోలో బద్వేలుకి సుమారు 10కిమీ దూరంలో సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మానుష్యంగా ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. 

అక్కడ కాసేపు సరదాగా గడిపాక మళ్ళీ ఆమె పెళ్ళి ప్రస్తావన చేయడంతో విగ్నేష్ సంచీలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ బయటకు తీసిఆమెపై పోసి నిప్పంటించాడు. ఆమె బాధతో ఆర్తనాధాలు చేస్తుంటే విగ్నేష్ ఆమెను అలాగే వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. 

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఆ బాలికాని కడప రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా కేసు నమోదు చేసుకుని కడప శివారులో అతనిని అరెస్ట్ చేశారు. ఆమె చికిత్స పొందుతూ శనివారం అర్దరాత్రి మరణించింది. 

ఈ ఘటనపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ వేగంగా జరిపించి హంతకుడికి కటిన శిక్ష పడేలా చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Post