చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ట్రాఫిక్ జామ్

April 19, 2024
img

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలిగించే గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని ఆలయ పూజారులు ఇటీవల ప్రకటించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

నగరం నలుమూలల నుంచి చుట్టు పక్కల జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వాహనాలపై ఆలయానికి చేరుకొనే ప్రయత్నం చేశారు. దీంతో సుమారు 10-15 కిమీ మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

మసాబ్ ట్యాంక్ నుంచి మొహిదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం వరకు వాహనాలతో రోడ్లు నిండిపోయాయి.  ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని 4-5 గంటలు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన భక్తులు ఎండ వేడి తాళలేక విలవిలలాడిపోయారు.

Related Post