ప్రతీ రెండేళ్ళకు ఓసారి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం వనదేవతలను మళ్ళీ వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది.
గద్దెలపై ఉన్న సమ్మక్కని మళ్ళీ చిలుకల గుట్టలోని ఆలయానికి, సారలమ్మని కన్నెపల్లికి, గోవిందరాజులను కొండాయికి, పగిడిద్ద రాజును పూనుగొండ్లలో ఆలయాలకు కాలినడకన వేలాదిమంది భక్తులు ఊరేగింపుగా తీసుకు వెళ్ళి సాగనంపుతారు. మళ్ళీ రెండేళ్ళ వరకు వారు అక్కడే పూజలు అందుకుంటారు.
ఈ నాలుగు రోజులలో 1.35 కోట్లమంది భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకొని, బియ్యం, బెల్లం దిమ్మలు మొక్కులుగా చెల్లించుకున్నారు. మహిళలు సమ్మక్కసారలమ్మలను తమ ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం సమర్పించుకున్నారు. కొంతమంది భక్తులు కోళ్ళు, మేకలు బలి ఇచ్చి మొక్కు చెల్లించుకున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కతో సహా పలువురు ప్రముఖులు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని తులాభారంతో తమ బరువుకు సమానమైన బెల్లం దిమ్మలను కానుకగా సమర్పించుకున్నారు. నాలుగు రోజుల మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసినందుకు చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సజావుగా ముగియబోతోంది.