అవును నిజమే! శంషాబాద్ మునిసిపాలిటీ పరిధిలో హీరో హోండా మోటార్ సైకిల్స్ షో రూమ్ ఉంది. దాని ఆవరణలో నీళ్ళ కోసం బోరు వేస్తుంటే ఆ ప్రకంపనలకు షో రూమ్ ఉన్న భవనం కూలిపోయింది. అయితే భవనంలో పెళపెళమని చప్పుళ్ళు మొదలవడంతో లోపల ఉన్న ఉద్యోగులు అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు.
వారు బయటకు రాగానే ఆ భవనం కుప్పకూలిపోయింది. తృటిలో ప్రాణ నష్టం తప్పింది కానీ షో రూమ్‌లో అమ్మకానికి సిద్దంగా ఉంచిన కొత్త మోటార్ సైకిల్స్ అన్నీ ధ్వంసం అయ్యాయి. ఈ భవనం నిర్మించి 50-60 సంవత్సరాలు పైనే అయిన్నట్లు స్థానికులు చెపుతున్నారు.
శంషాబాద్ ఇంతకంటే ఇంకా పాత భవనాలు చాలా ఉన్నాయని, కానీ వాటికి చాలా డిమాండ్ ఉండటంతో వాటి యజమానులు భవనాలకు పూర్తిగా మరమత్తులు చేయించకుండా అద్దెలకు ఇస్తున్నారని స్థానికులు చెప్పారు. ఇలాంటి షో రూమ్స్, దుకాణాలు పెట్టుకున్నవారు వాటిని అందంగా కనబడేందుకు పైపై మెరుగులు దిద్దుతారే తప్ప ఎవరూ మరమత్తులు చేయాలనుకోరని స్థానికులు చెప్పారు.
భవనం శిధిలావస్థకు చేరుకొన్నందునే ఈ మాత్రం ప్రకంపనలకే కుప్పకూలిపోయిందని, అదే... భూకంపం వస్తే ఏమయ్యేదో అని స్థానికులు అంటున్నారు. ఇకనైనా శంషాబాద్ మునిసిపల్ అధికారులు శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.