సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల ఆల్ఫా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు మూయించివేశారు. ఆ హోటల్లో ఆహార పధార్ధాల నాణ్యత, పరిశుభ్రత సరిగా లేదంటూ గత కొంత కాలంగా పిర్యాదులు వస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ నెల 15న తనికీలు చేసి, ఆహార పదార్ధాల శాంపిల్స్ సేకరించి వెళుతూ హోటల్ వంటగదిలో, బయట ప్రజలకు ఆహార పదార్ధాలు వడ్డించే చోట కూడా పరిశుభ్రత పాటించాలని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.
కానీ వారి హెచ్చరికలను హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆదివారం మళ్ళీ మరోమారు హోటల్లో తనికీలు నిర్వహించి, ఆహార పదార్ధాల శాంపిల్స్ సేకరించి, పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహించినందుకు హోటల్‌ను మూయించివేసి తాళాలు వేశారు. హోటల్లో సేకరించిన ఆహార పదార్ధాలను నాణ్యతా పరీక్షల కోసం నాచారంలో ల్యాబ్‌కు పంపించారు. హోటల్ యాజమాన్యానికి భారీ జరిమానా విధించడం ఖాయమే.
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో లభించే ఇరానీ ఛాయ్, బిర్యానీ చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిందే. వాటికోసమే రోజూ ఆ హోటల్‌కి వచ్చేవారు వేలమంది ఉంటారు. ఆల్ఫా హోటల్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మొండా మార్కెట్ పక్కనే ఉండటంతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. ఆ హోటలో ఛాయ్, ఆహార పదార్ధాలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ పరిశుభ్రత ఉండదనేది అందరికీ తెలుసు. ఇన్నేళ్ళకు జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకొన్నారు. కానీ జరిమానా చెల్లించి తిరిగి తెరిచినా హోటల్ యాజమాన్యం తీరు మారుతుందా? డౌటే!