చిన్న మంచూ... నీ పోరాటం దేనికి?

March 25, 2023
img

మంచు సోదరుల మద్య గొడవలు సోషల్ మీడియా అనే చేపలబజారులో పడటంతో అంతా కంపుకంపైపోతోంది. వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో తెలీదు కానీ సోషల్ మీడియాలో అందరూ కలిసి మంచు కుటుంబం ప్రతిష్టని మంచులా కరిగించేస్తున్నారు. 

“మనోజ్ చిన్నోడు... ఏదో ఆవేశంలో ఫేస్‌బుక్‌లో పెట్టేడు. ఇదేం పెద్ద విషయం కాదు. మా మద్య ఇలాంటి గొడవలు కామనే,” అంటూ విష్ణు లైట్ తీస్కోమని జనాలకి చెప్పగలిగాడు కానీ తమ్ముడికి చెప్పలేకపోయాడు. అందుకే మంచు మనోజ్ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నాడు. 

“అందరూ బ్రతకాలి అందరినీ బ్రతకనివ్వాలి...” అంటూ మొదలుపెట్టి పోరాటానికి చిహ్నంగా మూసి ఉన్న పిడికిలి బొమ్మతో “తప్పుల మద్య బ్రతకడం కంటే సరైనదాని కోసం పోరాడాలి,” అనే సూజీ ఖాసీం కొటేషన్ పెట్టాడు.  దాంతో పాటు “సృజనాత్మకతకు వ్యతిరేకధోరణి శత్రువు,” అంటూ డేవిడ్ లించ్ కొటేషన్ పెట్టాడు. 

ఇంతకీ మంచు మనోజ్ సోదరుడుతో పోరాటం దేనికోసం? ఆస్తి కోసమా?కుటుంబంలో స్థానం కోసమా?తమ్ముడుతో సినిమా పెట్టుబడుల విషయంలోనా? దేని కోసమో తెలీదు. కానీ ఈవిదంగా కొటేషన్స్ పెడుతూ ఉంటే, నెటిజన్స్ సృజనాత్మకతను ఆయనా తట్టుకోలేరు. మంచు కుటుంబం కూడా తట్టుకోలేదని గ్రహిస్తే మంచిది. అయినా సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తే అన్నదమ్ముల సమస్యలు పరిష్కారం అవుతాయా? కుటుంబం పరువు బజారు కీడ్చుకోవడం తప్ప! 

 

Related Post