సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందినా 45 మంది సజీవ దహనం అయ్యారు.
వారు బస్సులో మక్కా నుంచి మదీనాకి వెళుతున్నప్పుడు అదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మదీనాకు సుమారు 25 కిమీ దూరంలో ముఫ్రిహత్ అనే ప్రాంతంలో వారి బస్సు ఓ డీజిల్ ట్యాంకర్‌ని ఢీకొంది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి క్షణాలలో బస్సు, ట్యాంకర్ రెండు దగ్ధమైపోయాయి.
బస్సులో అందరూ ఘాడనిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలుసుకునేలోగానే అగ్నికి ఆహుతైపోయారు. వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. బస్సు డ్రైవరు, షోయబ్ అనే యువకుడు మాత్రం బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
చనిపోయినవారిలో హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందినా నజీరుద్దీన్ కుటుంబానికి చెందినవారే 18 మంది ఉన్నారు. ఆ దారిన కారులో వెళుతున్నవారు ఎవరో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బందిని వెంటబెట్టుకువచ్చి మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలి దగ్ధమైంది. బస్సులో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
హైదరాబాద్‌లోని విద్యానగర్, బోరబండ, మూసారాం బాగ్, నల్లకుంట టోలీచౌకీ, నటరాజ్ నగర్, మురాద్ నగర్, జిర్రా, అడిక్ మెట్ నుంచి మొత్తం 54 మంది ఉమ్రా యాత్ర కోసం ఈ నెల 9న హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
మర్నాడు అందరూ మక్కా చేరుకొని అక్కడే 16వ తేదీ వరకు ఉండిపోయారు. ఆదివారం రాత్రి మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరారు. కానీ వారిలో 8మంది అదృష్టవంతులు కూడా ఉన్నారు. నలుగురు మర్నాడు ఉదయం వస్తామని చెప్పగా, మరో నలుగురు కారులో వస్తామని చెప్పడంతో మిగలిన 46 మంది బస్సులో మదీనాకు బయలుదేరారు. కనుక మక్కాలో ఆగిపోయిన 8 మంది ప్రాణాలతో బయటపడిన అదృష్టవంతులే.
ఈ ప్రమాదం గురించి సౌదీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని తెలంగాణ హజ్ కమిటీకి సోమవారం ఉదయం సమాచారం అందించింది. హజ్ కమిటీ వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌కి సమాచారం అందించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్, సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
మహ్మద్ అజారుద్దీన్, స్థానిక ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను ఓదార్చుతున్నారు. డీఎన్ఏ పరీక్షలు చేసి మృతులను గుర్తింఛి మదీనాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున మదీనాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు.