దొంగలు కాదు... పోలీసు అధికారులే అరెస్ట్ అవుతున్నారు!

May 22, 2024
img

ఇంతకాలం పోలీసులు దొంగలు, అవినీతిపరులను అరెస్ట్ చేయడం గురించి విన్నాము. కానీ ఇప్పుడు పోలీస్ ఉన్నతాధికారులే వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 

తాజాగా హైదరాబాద్‌ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఏసీపీగా పనిచేస్తున్న టిఎస్ ఉమామహేశ్వర రావుని మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని భావిస్తున్న ఏసీబీ, నిన్న తెల్లవారుజాము 5 గంటల నుంచి ఒకే సమయంలో హైదరాబాద్‌తో నేరేడ్ మెట్, ఎల్బీ నగర్‌తో సహా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భీమవరం, అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నంలోని ఆయన సమీప బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఇటీవల వెలుగులోకి వచ్చిన సాహితీ ఇన్‌ఫ్రా ప్రీ-లాంచ్ బుకింగ్స్ పేరుతో చేసిన వందల కోట్ల మోసం కేసుని ఉమామహేశ్వర రావే పర్యవేక్షిస్తున్నారు. దానిలో సదరు సంస్థ నిర్వాహకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసుకుని, వారికి వత్తాసు పలుకుతుండటంతో ఆయనపై ప్రజలు ఏసీబీకి పిర్యాదులు చేయడంతో ఈ డొంక కదిలింది. 

ఈ సోదాలను పర్యవేక్షించిన జెడీ.సుదీంద్రబాబు ఏసీపీ ఉమామహేశ్వర రావుని అరెస్ట్ చేసిన్నట్లు ధృవీకరించారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అక్రమస్తుల కేసులో తదుపరి విచారణ చేపడతామని చెప్పారు. 

Related Post