సూర్యాపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య!

February 11, 2024
img

సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ విద్యార్ధిని వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది. శనివారం రాత్రి పాఠశాలలో ఫేర్ వెల్ పార్టీ జరుగుతుండగా, ఆమె తన గదికి వచ్చి ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

పది నిమిషాలలో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిన ఆమె ఎంతకూ రాకపోవడంతో సహ విద్యార్ధులు ఆమె గదికి వెళ్ళి చూడగా కొన ఊపిరితో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. స్నేహితులు ఆమెను కిందకు దించి కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వైష్ణవి మృతి చెందిందని వైద్యులు చెప్పారు. 

భోజనం విషయంలో ఆమె సిబ్బందిని ప్రశ్నించగా  వారు దురుసుగా జవాబివ్వడమే కాకుండా అధ్యాపకులకు ఆమెపై ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తోంది. అధ్యాపకులలో కొందరు ఆమెను కించపరుస్తూ మాట్లాడటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వైష్ణవి సహచర విద్యార్ధులు చెపుతున్నారు. 

ఈ విషయం తెలుసుకుని వైష్ణవి తల్లితండ్రులు కాలేజీకి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కాలేజీలో చదువు పూర్తి చేసుకుని కూతురు ఇంటికి తిరిగి వస్తుందని తాము ఎదురుచూస్తుంటే, ఫేర్ వెల్ రోజునే ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారిందంటూ వారు విలపించారు. దీనికి పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని, పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వైష్ణవి తల్లితండ్రులు డిమాండ్ చేశారు.

Related Post