తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కు శుక్రవారం సాయంత్రం సోమాజీగూడ, యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. శస్త్ర చికిత్స జరిగి 24 గంటలు కూడా కాక మునుపే వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ వాకర్ సాయంతో లేచి నిలబడటమే కాకుండా మెల్లగా నడుస్తున్నారు కూడా.
ఇటువంటి శస్త్ర చికిత్సలు చేయించుకొన్నవారందరినీ వైద్యులు ఇదేవిదంగా నడిపిస్తుండతారు. అయితే ఇంతవయసులో కూడా కేసీఆర్ శస్త్ర చికిత్సని తట్టుకోవడమే కాకుండా 24 గంటలు గడవక మునుపే లేచి నడవడం ప్రారంభించడంతో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, తెలంగాణ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నికలలో కేసీఆర్‌తో హోరాహోరీగా పోరాడినప్పటికీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్ వైద్య చికిత్సలో ఎటువంటి లోటు రానీయ వద్దని, ఆయన భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
కేసీఆర్ మరో 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని వైద్యులు సూచించారు. అందువల్ల 2024 ఫిబ్రవరి వరకు ఆయన శాసనసభకు రాలేకపోవచ్చు. కనుక ఆయన ప్రమాణస్వీకారానికి ప్రభుత్వం, గవర్నర్, శాసనసభ కార్యదర్శి మినహాయింపునిచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు ఏమైనా చేస్తారేమో చూడాలి.