నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

December 09, 2023
img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు  శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

ముందుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేత ప్రోటెం స్పీకర్‌గా ఈరోజు ఉదయం 8.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. 

ప్రోటెం స్పీకర్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ముందుగా సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత తెలుగు అక్షరమాల క్రమం ప్రకారం మిగిలిన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయడానికి ఇష్టపడని 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఈరోజు సమావేశానికి రావడం లేదు.     

శాసనసభలో కాంగ్రెస్‌ తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది (39) ఎమ్మెల్యేలు ఉన్నందున ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. గతంలో కాంగ్రెస్‌, బీజేపీల కంటే మజ్లీస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండేది. ఇప్పుడు దాని స్థానంలోకి బిఆర్ఎస్ వచ్చింది.

బిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మాజీ సిఎం కేసీఆర్‌నే ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు నిన్న సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగినందున మరో రెండు నెలల వరకు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. కనుక అంతవరకు హరీష్ రావు లేదా కేటీఆర్‌ బిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించే అవకాశం ఉంది. 

ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత స్పీకర్‌ ఎన్నికకి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కి ఆ పదవి ఖరారు చేసినందున ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. రేపు ఆయన స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల చేత కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సోమవారం ఉదయం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. మంగళవారం సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఉభయసభలు ధన్యవాదాలు తెలిపిన తర్వాత నిరవధికంగా వాయిదా పడతాయి.

Related Post