తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కూలిన వృక్షం

June 01, 2023
img

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం ఓ ప్రమాదం జరిగింది. ఆలయ ఆవరణలో ధ్వజ స్తంభం పక్కనే ఉన్న వందల ఏళ్ళనాటి రావిచెట్టు హటాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భక్తులపై అది కూలిపోవడంతో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు ఘటన స్థలంలోనే చనిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే అంబులెన్సులో తిరుపతిలోని రూయా హాస్పిటల్‌కు వారిని తరలించారు.

మృతుడు కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప (70)గా పోలీసులు గుర్తించారు. గతంలో ఆయన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో వైద్యుడుగా పనిచేశారు. ప్రస్తుతం కడపలో ఉంటున ఆయన తిరుపతి స్విమ్స్ వైద్య కళాశాలలో మెడిసన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చారు. తర్వాత గోవిందరాజస్వామిని దర్శించుకొనేందుకు వచ్చినప్పుడు అనూహ్యంగా ఈ ప్రమాదంలో మరణించారు.

ఆలయ సిబ్బంది కూలిపోయిన రావిచెట్టును పూర్తిగా తొలగిస్తున్నారు. ఆలయంలో ఏనాడూ ఇటువంటి ప్రమాదం జరుగలేదని, కానీ ఎంతో ధృడంగా కనిపిస్తున్న రావిచెట్టు కూలిపోవడం, దాని కింద ఇతమంది భక్తులు గాయపడటం, వారిలో ఒకరు చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందని ఆలాయ ఈవో అన్నారు.

Related Post