భర్తలేని లోకం నాకెందుకంటూ...

May 25, 2023
img

హైదరాబాద్‌, అంబర్ పేటలో డీడీ కాలనీలో ఓ మహిళ భర్త లేని జీవితం నాకొద్దంటూ ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, అంబర్ పేటకు చెందిన సాహితి (29), వనస్థలిపురానికి చెందిన మనోజ్‌లు ఏడాది క్రితమే వివాహం చేసుకొన్నారు. మనోజ్‌ అప్పటికే అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్ళికాగానే ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. అక్కడే సాహితి కూడా ఉద్యోగం సంపాదించుకోవడంతో వారి జీవితాలు పూలనావలా సాగిపోతున్నాయి. 

మూడు వారాల క్రితం సాహితి తల్లితండ్రులను, అత్తమామలను చూసేందుకు హైదరాబాద్‌ వచ్చి వారితో సంతోషంగా రోజులు గడుపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో మనోజ్‌కు గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఊహించని ఈ ఘటనతో సాహితి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం భర్త మనోజ్ మృతదేహం అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించిన భర్తను ఆవిదంగా చూసి ఆమె ఇంకా క్రుంగిపోయింది. నిన్న బుదవారం మనోజ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత తల్లితండ్రులతో కలిసి అంబర్ పేటలో పుట్టింటికి వెళ్ళిపోయింది. 

ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాహితి ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బయటకు వెళ్ళివచ్చిన ఆమె చెల్లి అక్కను ఆ స్థితిలో చూసి షాక్ అయ్యింది. వనస్థలిపురంలో ఉన్న తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు, మనోజ్ తల్లితండ్రులు అందరూ హుటాహుటిన అంబర్ పేట చేరుకొన్నారు. 

అల్లుడు అంత్యక్రియలు జరిగిన 24 గంటలలోపే కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఆమె తల్లితండ్రులు, చెల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. కొడుకును పోగొట్టుకొని తీరని శోకం అనుభవిస్తున్న మనోజ్ తల్లితండ్రులు కోడలు కూడా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని సాహితి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె తల్లితండ్రులకు అప్పగించారు. కేవలం ఏడాది వ్యవధిలో సాహితి, మనోజ్‌, వారిరువురి కుటుంబ సభ్యుల జీవితాలలో అంతులేని ఆనందాలు నింపిన ఆ భగవంతుడే, అందరి జీవితాలలో తీరని విషాదం నింపడం ఎవరూ ఊహించలేరు... జీర్ణించుకోలేరు కూడా!

Related Post