మంచు అప్పుడే కరిగిపోయిందా?విష్ణు-మనోజ్ బిగ్‌ ఫైట్!

March 24, 2023
img

తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు పరిచయం అవసరమే లేని వ్యక్తి. స్వశక్తితో పైకి ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన ముగ్గురు పిల్లలు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మిలకు ఇండస్ట్రీలో బలమైన పునాదులు వేసి వారికి గాడ్ ఫాదర్‌గా నిలిచారు. వారు ముగ్గురూ కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపే సాధించుకొన్నప్పటికీ వారిలో మంచు విష్ణు, మంచు మనోజ్ తరచూ వివాదాలలో చిక్కుకొని తాము ఇబ్బందులు పడుతూ, తండ్రికి కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని చెప్పక తప్పదు. 

తాజాగా మోహన్ బాబుకి వరుసకి సోదరుడైన సారధి అనే వ్యక్తి ఇంట్లోకి మంచు విష్ణు గురువారం రాత్రి జొరబడి గొడవ పడ్డాడు. ఈ వీడియోని మంచు మనోజ్ తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అయితే మోహన్ బాబు మందలించడంతో మనోజ్ ఆ వీడియోను తన ఫేస్‌బుక్‌లో నుంచి వెంటనే తొలగించాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలోకి అక్కడి నుంచి మీడియాలోకి వెళ్లిపోయింది. దీంతో మంచు సోదరుల మద్య గొడవలు రోడ్డున పడ్డాయి. 

ఇంతకీ విషయం ఏమిటంటే, సారధి మొదట మంచు విష్ణుతో సన్నిహితంగా ఉంటూ అతని సినిమా వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. కానీ ఆ తర్వాత అతనికి దూరమై మోహన్ బాబుతో కలిసి పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

గురువారం మంచు విష్ణు, సారధితో గొడవపడి, రాత్రి 10 గంటలకు ఆయన ఇంట్లో జొరబడి మళ్ళీ గొడవపడ్డాడు. సారధి దంపతులు అతనికి నచ్చజెప్పి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుండగా విష్ణు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడటం ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. 

దీనిపై మంచు మనోజ్ వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తోంది. కానీ అన్నదమ్ములు గొడవపడి కుటుంబ పరువు బజారుకీడ్చవద్దని మోహన్ బాబు ఇద్దరినీ గట్టిగా మందలించడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వారి మద్య ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయనే విషయం లోకానికి తెలిసిపోయింది. 

మంచు మనోజ్, మౌనికల ప్రేమ, సహజీవనంతో మోహన్ బాబు ఇబ్బందిపడ్డారు కానీ ఎట్టకేలకు ఈనెల 3వ తేదీన అట్టహాసంగా జరిగింది. వారి వివాహ కార్యక్రమానికి మంచు విష్ణు భార్యా పిల్లలతో కలిసి కేవలం ఓ అతిధిలా వచ్చి వెళ్లిపోయాడు. 

మంచు మనోజ్ వైవాహిక జీవితం, సినిమా కెరీర్‌ రెండూ గాడిలో పడ్డాయనుకొంటుంటే, నెలరోజులు తిరక్కుండానే సోదరుడుతో ఈ గొడవలు బయటపడ్డాయి. మోహన్ బాబు దశాబ్ధాల కష్టంతో సంపాదించిన కీర్తిప్రతిష్టలను కొడుకులిద్దరూ కలిసి ఇంత త్వరగా మంచు కరిగించిన్నట్లు కరిగించేస్తుండటం చాలా బాధాకరమే. కనుక మోహన్ బాబే స్వయంగా పూనుకొని వారిద్దరి గొడవలను తీర్చకపోతే మిగిలిన ప్రతిష్ట కూడా మంచులా కరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

Video Courtecy: TV9 Telugu 

Related Post